Gopichand: బ్లూఆరిజిన్ మిషన్‌... అంతరిక్షయానంతో చరిత్ర లిఖించనున్న తెలుగువ్యక్తి గోపీచంద్

  • ఎన్ఎస్-25 మిషన్ పేరుతో చేపట్టనున్న అంతరిక్ష యాత్రకు ఆరుగురి ఎంపిక
  • ఏరోనాటికల్ సైన్స్‌లో బీఎస్సీ పూర్తి చేసి అమెరికాలో స్థిరపడ్డ తోటకూర గోపీచంద్
  • 11 నిమిషాల పాటు సాగనున్న అంతరిక్ష ప్రయాణం
Gopichand Thotakura set to become india first space flyer

మన తెలుగు వ్యక్తి అంతరిక్షయానంలో చరిత్ర లిఖించబోతున్నాడు. విజయవాడకు చెందిన తోటకూర గోపీచంద్ అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగు వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కబోతున్నాడు. బ్లూఆరిజిన్... ఎన్ఎస్-25 మిషన్ పేరుతో చేపట్టనున్న అంతరిక్ష యాత్రకు ఆరుగురిని ఎంపిక చేసింది. ఇందులో గోపీచంద్ పేరు ఉంది. బ్లూఆరిజిన్ చేపట్టిన న్యూషెపర్డ్ ప్రాజెక్టులో టూరిస్ట్‌గా గోపీచంద్ వెళ్లనున్నాడు.

గోపీచంద్ ఏరోనాటికల్ సైన్స్‌లో బీఎస్సీ పూర్తి చేశారు. అమెరికాలో స్థిరపడ్డారు. అట్లాంటా ఏర్పాటు చేసిన ప్రిజర్వ్ లైఫ్ అనే వెల్ నెస్ సెంటర్‌కు గోపీచంద్ కో-ఫౌండర్‌గా ఉన్నారు. గతంలో పైలట్ శిక్షణ తీసుకున్నారు. ఈ క్రమంలోనే బ్లూఆరిజిన్ మిషన్ ద్వారా అంతరిక్షయానం చేయనున్నారు. బ్లూఆరిజిన్ అధికారికంగా ప్రకటించే వరకు తాను అంతరిక్షంలోకి వెళుతున్నట్లు తన కుటుంబానికి తెలియదన్నారు.

ఈ యాత్ర 11 నిమిషాల పాటు సాగనుంది. ధ్వని కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ప్యారాచూట్ సాయంతో క్యాప్సూల్‌లో కిందకు దిగుతారు. బ్లూఆరిజిన్ ఇప్పటి వరకు 6 మిషన్లలో 31 మందిని అంతరిక్షంలోకి పంపించింది. వీరంతా సముద్రమట్టానికి 80 నుంచి 100 కిలో మీటర్ల ఎత్తున వరకు వెళ్లి తిరిగి వచ్చారు. 

తోటకూర గోపీచంద్‌తో పాటు అంతరిక్షంలోకి వెళ్లనున్న వారిలో వెంచర్ క్యాపిటలిస్ట్ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ వ్యాపారి కెన్నెత్ ఎల్ హెస్, సాహసయాత్రికుడు కరోల్ షాలర్, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్ వెళ్లనున్నారు.

More Telugu News